తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందులో అక్రమంగా మద్యం, డబ్బులు తరలిస్తే వాటిని స్వాదీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ తనిఖీల్లో భాగంగా ఇవాళ పోలీసులు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కారును తనిఖీ చేశారు. హుస్నాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం పాల్గొన్న హరీష్ సిద్దిపేటకు తిరుగి వస్తుండగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు ఆయన వాహనాన్ని ఆపారు. అందరి వాహనాలతో పాటు మంత్రి వాహనంలో కూడా తనిఖీ చేశారు. అయితే అందులో ఎలాంటి అక్రమ వస్తువులు లేకపోవడంతో వదిలిపెట్టారు. ఈ తనిఖీలు చేపడుతున్న పోలీసులకు మంత్రి సహకరించారు.